నాగురించి నేను.......
అదృష్టదీపక్
నేను 1950 జనవరిలో 18తేదీన పుట్టాను. కాశీమజిలీ కధలు రెండవ భాగంలో అదృష్టదీప చక్రవర్తి కధ ఉంది. దేవుళ్ళపేరు కాకుండా, వైవిధ్యంగా ఉంటుందని, కమ్యూనిస్టు అయిన మా మేనమామ నాకు ఆ పేరు పెట్టాడు.
మా ఊరు తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెం. నా బాల్యంలో మొదటి పది సంవత్సరాలూ అక్కడే గడిచాయి. రావులపాలెం-జొన్నాడల మధ్య గోదావరి నది మీద వంతెన నిర్మించిన తరువాత, కోనసీమ ముఖద్వారమైన రావులపాలెం, రాష్ట్రంలోని ప్రముఖ వ్యాపార కేంద్రాలలో ఒకటిగా మారిపోయింది.
వంతెన నిర్మించకముందు ఆ ఊరు నా బాల్యంలో నాగరికతకు దూరంగా, బయటి ప్రపంచంతో అంతగా సంబంధాలు లేకుండా, అనేక విషయాలలో ఫ్యూడల్ అహంకారాలకు నిలయంగా ఉండేది. రవాణాసౌకర్యాలు చాల తక్కువగా ఉండేవి. పండగల్లోనూ, వేసవి సెలవుల్లోనూ అమ్మతో కలసి రామచంద్రపురం తాలూకాలోని మా మేనమామగారి ఊరు మాచవరంలో గడిపేవాణ్ని. ఈవేళ రావులపాలెం నుంచి, ప్రస్తుతం నేను స్థిరపడిన రామచంద్రపురం పట్టణానికి సరిగ్గా 45నిమిషాల ప్రయాణం. కానీ నా బాల్యంలో ఒకపూట సరిపోయేది కాదు. రావులపాలెంలో నావమీద గోదావరి దాటి, జొన్నాడ రేవులో దిగి, ఆలమూరు వరకూ నడచి, అక్కడ రామచంద్రపురంవైపు వెళ్ళే బస్సు ఎక్కేవాళ్ళం. వేసవి కాలంలో గోదావరిలో నీళ్ళు బాగా తగ్గిపోయినప్పుడు నావలు తిరిగేవి కావు. నీళ్ళు తగ్గిన రేవులను ‘పాటిరేవు’లని పిలిచేవారు. ఆ సమయంలో అవతలి గట్టుకు చేరాలంటే పాటిరేవులో మొలలోతు నీళ్ళలో దిగి నడవాలి. అలవాటులేని ప్రాంతాలలో నీటిలో దిగితే ఊబిలో కూరుకుపోయే ప్రమాదాలు సంభవించేవి. ఇసుకతిప్పల మీద మొలచిన రెల్లుదుబ్బుల మధ్య పరుగులెత్తే కృష్ణజింకలను చూడటం నా బాల్యంలో మరపురాని అనుభవం.
గోదావరి మీద వంతెన నిర్మించడానికి పనివాళ్ళు ప్రత్యేకంగా కేరళనుంచి వచ్చారు.
వాళ్ళ ఆచారవ్యవహారాలు మాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించేవి. ముఖ్యంగా- వంటల్లో కొబ్బరినూనె ఉపయోగించడం మాకు వింతగా ఉండేది. వారానికోరోజు పడవ మీద ఉప్పు వచ్చేది. ఊళ్ళోజనం కాలువ దగ్గరకు వెళ్ళి పడవమీద ఉప్పు కొనేవారు. ఒక అర్ధణాకు కుంచం నిండా ఉప్పు ఇచ్చేవారు. (రూపాయకు 32). మాఊరికి ఐదుమైళ్ళ దూరంలోని తాలూకా కేంద్రం కొత్తపేటలో సినిమాహాలు ఉండేది. సినిమా మారితే మైకులో పాటలు వేస్తూ, వాల్ పోస్టర్లు అంటించిన గుర్రబ్బండి ప్రచారానికి వచ్చేది. మైకులో పాటలు వినిపించిన వెంటనే పిల్లలంతా సినిమా బండికి ఎదురువెళ్ళి, బండివాడు విరజిమ్మే కరపత్రాలు ఏరుకుంటూ, ఊరు దాటేవరకూ బండివెంట పరుగులు తీసేవాళ్ళం!
కాలువగట్టునే కచేరీచావడి దగ్గర రెడ్డిగారి హోటల్ లో రెండు అణాలకు ప్లేటు ఇడ్లీ, టీ ఇచ్చేవారు. (రూపాయకు 16 అణాలు). ఇళ్ళలో రెగ్యులర్ గా కాఫీ,టీలు కాచుకునేవారు కాదు. బంధువులు రావడంలాంటి ప్రత్యేక సందర్భాల్లో అర్ధణా పెట్టి టీ పొట్లం కొని, టీ కాచుకొని ఇంట్లో అంతా తాగేవారు. రెడ్డిగారి హోటల్ కి ఆంధ్రప్రభ దినపత్రిక వచ్చేది. ప్రతిరోజూ ఖాళీసమయాల్లో ఒకాయన పెద్దగొంతుతో పేపరులో విశేషాలు చదువుతుంటే, అక్కడ చేరినవారంతా శ్రద్ధగా వినేవారు. మామయ్య మా ఊరు వచ్చినపుడు నా చేతికో బేడ ఇచ్చి సిగిరెట్టు పెట్టె, అగ్గిపెట్టె తెమ్మనేవాడు.(రుపాయకు 8 బేడలు). ఆయన కాల్చే డెక్కన్ సిగిరెట్టుపెట్టె ఆరు కానులకూ, అగ్గిపెట్టె అర్ధణాకూ ఇచ్చేవారు. (రూపాయకు 64 కానులు). పిల్లల చిరుతిళ్ళకు ఒక కానీ ఇస్తే గిద్దెడు బఠానీలు వచ్చేవి. మంచి బిస్కెట్లు కానీకి ఒకటి ఇచ్చేవారు. కొంతకాలానికి కాలువ దగ్గర కిళ్ళీకొట్టులోకి, పట్నంనుంచి కాగితంలో చుట్టిన కేకులు తెచ్చి అమ్మేవారు. కేకు ఖరీదు ఒక అణా. అది చాలా ఖరీదైన వ్యవహారం కనుక పిల్లలకు ఎప్పుడైనా అరుదుగా కొనిపెట్టేవారు. ‘కేకు’ని మేము ‘ఇసుకపప్ప’ అని పిలిచేవాళ్ళం!
మాచవరంలో మా మేనమామ ఒక రేడియో కొన్నాడు. చిన్నసైజు ట్రంకుపెట్టెలా ఉండే ఆ రేడియో - కారులకూ, లారీలకూ ఉపయోగించే పెద్ద బేటరీ సాయంతో పనిచేసేది. ఆకాశవాణి విజయవాడ కేంద్రంనుంచి ప్రతి మంగళవారమూ రాత్రి ఎనిమిది గంటలకు ‘కల్పలత’ అనే సినిమా పాటల కార్యక్రమం ప్రసారం చేసేవారు. నెలకోసారి సంక్షిప్త శబ్దచిత్రం(సినిమా) ప్రసారం అయ్యేది. ఆ కార్యక్రమాల కోసం ఇంటిల్లపాదీ ఎదురుతెన్నులు చూశేవారు. అవి శ్రద్ధగా విని నేను ఆ పాటలన్నీ పాడుతుండేవాణ్ని. దసరా సీజన్ లో మాస్టర్లకూ గిలకలు పట్టుకుని తిరిగే పిల్లల్లో నేనే ప్రధాన గాయకుణ్ని. ‘వందేమాతరం’ సినిమాలో నేనురాసిన ‘ఎదయా మీదయా మామీద లేదు’ అనే పేరడీపాటకు నేపధ్యం ఇదే!
1960 అనుకుంటాను- మా ఊరికి ఎలక్ట్రిసిటీ వచ్చింది. అంతవరకూ కిరోసిన్ దీపాలూ, హరికేన్ లాంతర్లూ ఉపయోగించేవాళ్ళం. మామయ్య ప్రోత్సాహంతో మాకు కూడా ‘కరెంటు’ వచ్చింది. మీట నొక్కితే లైటు వెలిగే విచిత్రం చూడటానికి బంధువులంతా మా ఇంటికి రావడం నాకింకా గుర్తుంది. మా ఇంటిదగ్గరే ఉన్న వేణుగోపాలస్వామి గుడి ఆవరణలో చిలువూరి సూర్యనారాయణరాజుగారు తాటాకుల పాక నిర్మించి అందులో ప్రైవేటు పాఠశాల నడిపేవారు. బోర్డు ఎలిమెంటరీ స్కూల్లో పాఠాలు బాగా చెప్పరనే ఉద్దేశంలో (నిజం కూడా) నాకు రాజుగారి పాకబడిలో విద్యాభ్యాసం చేయించారు. విద్యాబోధనకూ, క్రమశిక్షణకూ ఆ బడికి మంచిపేరు ఉండేది. అప్పటిలో ‘హెడ్ మాస్టర్’ అనే పదం మాకు తెలీదు. రాజుగారిని మేము ‘పెద్దమేస్టారు’ అనేవాళ్ళం. ఆయన దస్తూరి ముత్యాలకోవలా ఉండేది.
‘పాకబడిలో’ చదివినవాళ్ళకు ఆరవ తరగతిలో చేరే అవకాశం ఉండదని ప్రచారం జరగడంతో అయిదవ తరగతిలో నేను బోర్డు ఎలిమెంటరీ స్కూల్లో ప్రవేశించాను. మంచి మార్కులు వస్తున్నందున నాకు ‘వేంకట పార్వతీశ్వరకవులు’ రచించిన ‘పిల్లల బొమ్మల భారతం’ పుస్తకం బహుమతిగా ఇచ్చారు. ఆ రోజుల్లోనే ‘చందమామ’ పత్రిక నన్ను బాగా ఆకర్షించింది. నాలో పఠనాసక్తి పెరగడానికి ఈరెండూ బాగా దోహదం చేశాయి.
మా వీధిలో సత్తెమ్మగుడి ముందు ప్రతియేటా సంబరాలు జరిగేవి. సంబరాలు జరిగే మూడురోజులూ పంబలవారు (పంబ అనే వాయిద్యాన్ని ఉపయోగిస్తారు) ‘మాంధాత రాజు’ లాంటి కధలు తెల్లవార్లూ చెప్పేవారు. మధ్యమధ్య నిద్రమత్తు ఆవహిస్తున్న భక్తశ్రోతలను హూషారు చెయ్యడంకోసం చమత్కారమైన పాటలెన్నో పాడేవారు. వాటిలో అప్పుడప్పుడు మొరటు హాస్యమూ, హద్దుమీరిన బూతులు కూడా చోటుచేసికునేవి. వ్యవసాయదారుడైన మానాన్న నిరక్షరాస్యుడైనా భారత, రామాయణాల్లో ఘట్టాలన్నీ నాకు రసవత్తరంగా వర్ణించి చెప్పేవాడు. నేను పుట్టక మునుపే బ్రతుకుతెరువుకోసం బర్మా రాజధాని రంగూన్ వెళ్ళివచ్చాడు. తెలుగులో సంతకం చెయ్యడం రాకపోయినా హిందీ బాగా మాట్లాడేవాడు. ఎంతటివాళ్ళనైనా తన వాక్చాతుర్యంతోనూ, వెటకారాలతోనూ దెబ్బతీసేవాడు. ( నా రచనల్లో కనిపించే వ్యంగ్యానికి స్ఫూర్తి మానాన్నే అని నా నమ్మకం). రామదాసు కీర్తనలూ, అనేక జానపద గీతాలూ అద్భుతంగా పాడేవాడు.
అయిదోతరగతి చదివిన మా అమ్మ ఇరుగుపొరుగు స్త్రీలను అరుగుమీద కూర్చోబెట్టుకొని స్త్రీల పాటలూ, గేయకధలూ పాడి వినిపిస్తూ ఉండేది. బాలనాగమ్మ,ఊర్మిళాదేవి నిద్ర,లక్ష్మణదేవర మూర్ఛ,కుశలవ చరిత్ర మొదలైనవన్నీ పుస్తకం చూడకుండా పాడి వినిపించేది. మా మేనమామ సినిమాపాటల బాణీల్లో రాజకీయగీతాలు రాసి ఒక కరపత్రంగా అచ్చువేసి పంచేవాడు. ప్రజలలో అవి ఎంతగానో పాపులర్ అయ్యాయి. బాల్యంలోని ఈ నేపధ్యమే నన్ను కవిగానూ, కళాకారుడిగానూ తయారుచేసింది.
కేరళలో 1957 కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ విజయోత్సవంలో భాగంగా మాచవరంలో జరిగిన బహిరంగ సభలో మా మేనమామ నాచేత ఒకపాట పాడించాడు. ప్రజలముందు వేదికమీద నిలబడి పాటపాడటం అదే మొదటిసారి. అప్పుడు నా వయస్సు ఏడు సంవత్సరాలు.
1961 మానాన్న ఆరోగ్యం పాడైంది. మేము రావులపాలెంనుంచి మా మేనమామగారి ఊరు మాచవరం వచ్చేశాము. ఇంట్లో లెనిన్ ఫొటో పెట్టుకున్నందుకు కొంతమంది గ్రామపెద్దల కన్నెర్రకు గురైన మేము, స్వేచ్ఛగా అనేక ఇళ్ళమీద ఎర్రజెండాలు రెపరెపలాడే వాతావరణంలోకి ప్రవేశించాము. నేను కొత్తగా సైకిలు తొక్కటం నేర్చుకున్నాను. చదువు నిమిత్తం సైకిలుమీద రోజూ రామచంద్రపురం హైస్కూలుకి వెళ్ళివచ్చేవాడిని. ఇక్కడే నా మెదడు ఎదగడం ప్రారంభించింది. ఇక్కడనుంచే కవిగానూ, కళాకారుడిగానూ నా నడక మొదలైంది.
మా మేనమామ బుర్రకధలు చెప్పేవాడు. నాజర్ లాంటి ప్రజాకళాకారులతో ఆయనకు మంచిసంబంధాలు ఉండేవి. వాళ్ళందరితోనూ సన్నిహితంగా తిరిగే అవకాశం నాకు చిన్నతనంలోనే కలిగింది. ఊళ్ళోని నాటక సమాజానికి దర్శకుడు అయిన మా మేనమామే నాచేత నాటకాల్లో వేషాలు కూడా వేయించేవాడు. ఆత్రేయ రచించిన ‘కప్పలు’ నాటకంలోని పిల్లవాడి పాత్రద్వారా నేను నాటకరంగం మీద అడుగుపెట్టాను.
ఆ రోజుల్లో కమ్యూనిస్టుపార్టీ అధ్వర్యంలో ప్రతిఏడూ సాహిత్య వారోత్సవాలు నిర్వహించేవారు. అప్పుడుకొన్న ‘పారిపోయిన బఠానీ’ (పిళ్ళా సుబ్బారావు), ‘పేనూ-పెసరచేనూ’(నార్ల చిరంజీవి) పుస్తకాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. పుస్తకాలు చదవడం నాలో అభిరుచి స్థాయిని దాటిపోయి పెద్ద వ్యసనంగా మార్పుచెందింది. వేసవి సెలవుల్లో పంచాయితీ బోర్డుగ్రంధాలయంలో పుస్తకాలు- కనీసం రోజుకి రెండయినా చదివేవాణ్ణి.
అప్పుడే నాలో ఏదో రాయాలనే తపన మొదలైంది. ఆ తపన వెనుక అచ్చులో నాపేరు చూసుకోవాలనే కుతూహలం కూడా ఎక్కువే ఉండేది. నా మొదటి రచన 1962 రాజమండ్రినుంచి వెలువడే ‘చౌచౌ’ అనే మాసపత్రిక ప్రచురించింది. అప్పటికి నా వయస్సు పన్నెండు సంవత్సరాలు. మొదటిసారి అచ్చులో నాపేరు చూసుకున్నరోజు, ఆనందంతోనూ, ఉద్వేగంతోనూ సరిగ్గా నిద్రకూడా పట్టలేదు. అప్పటినుంచీ పత్రికలమీద నా దాడి మొదలయ్యింది. జోకర్, బుడుగు, నవ్వులు-పువ్వులు, పకపకలు మొదలైన హాస్యపత్రికలు నా రచనలెన్నో అచ్చువేశాయి. జోకర్, బుడుగు పత్రికలు కొన్ని సంవత్సరాల పాటు ప్రతినెలా నా సీరియల్స్ నీ, ప్రత్యేక శీర్షికలనూ ప్రచురించి నన్ను ఎంతో ప్రోత్సహించాయి. నేటి ప్రఖ్యాత మెజీషియన్ బి.బి. పట్టాభిరామ్ హైస్కూల్లో నాకు మంచి స్నేహితుడు. ప్రతినెలా ఎవరి పేరు ఎక్కువసార్లు అచ్చవుతుందో చూడాలనే పోటీలో మేమిద్దరమూ పుఃఖానుపుంఖంగా పత్రికలకు రచనలు పంపేవాళ్ళం. ఇవన్నీ హైస్కూలు రోజుల్లో ముచ్చట్లు!
అప్పుడే ‘మూడు యాభైలు’(శ్రీశ్రీ), కూనలమ్మ పదాలు(ఆరుద్ర) చదివాను. వాటిలోని ఒడుపూ, చమత్కారమూ నన్ను గట్టిగా పట్టుకున్నాయి. ఆ ఊపులోనే 1967 ఆంధ్రజ్యోతి వారపత్రికలో మొదలుపెట్టి, తరువాత జోకర్ మాసపత్రికలో ఓ సంవత్సరంపాటు ‘కూనలమ్మ పదాలు’ చందస్సులో ‘కోకిలమ్మ పదాలు’ రాశాను. శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ గీతాలు నాలోని కవిని భుజంతట్టి లేపాయి. అప్పటి వరకూ హాస్యపత్రికల ఆస్థానరచయితగా చలామణీ అవుతున్న నేను ఒక్కసారిగా సీరియస్ కవిగా అవతారమెత్తాను. ఆంధ్రప్రభ వీక్లీ 16-08-1967 జన్మదిన ప్రత్యేక సంచికలో నా మొదటి గేయం అచ్చువేసి పారితోషికంగా పదిరూపాయలు పంపారు. తరువాత రోజులలో సినిమాలకు పాటలు రాసి సంపాదించిన వేల రూపాయల కంటే ఆనాటి పదిరూపాయల మనియార్డరే నా సాహిత్యజీవితంలో తీపిగుర్తుగా నిలిచిపోయింది!
జీవితంలో విద్యార్ధి సమాఖ్య, యువజన సమాఖ్య, అభ్యుదయ రచయితల సంఘం, ప్రజానాట్యమండలి, - ఈ నాలుగు ప్రజారంగాల తోనూ క్రియాశీలంగా ఏర్పడిన అనుబంధం నాకు ఎంతో ఉత్తేజాన్ని కలిగించింది. ఊహ తెలిసినప్పటినుంచీ ఎర్రజెండా నా ఊపిరిలో భాగమైపోయింది. ఇటీవలి పరిణామాలు చూస్తుంటే ఎంతో బాధ కలుగుతోంది. ప్రస్తుతం వోట్లకోసం, సీట్లకోసం భూర్జువా పార్టీలను భుజాలమీద మోస్తున్న ఎర్రజెండాల ప్రయాణం ఎటో తెలియడంలేదు. ఎన్నెన్నో దారులలో చీలిపోయిన ఎర్రజెండాలు ఐక్యం కావాలనే నాలాంటి సామాన్యుడి ఆకాంక్ష నెరవేరే అవకాశం కనిపించడం లేదు.
తెలిసీతెలియని దశలో ఉదృతంగా వరదలా సాగిపోయిన నా రచనా వ్యాసంగం, నాకు తెలిసింది చాల తక్కువ అని తెలుసుకున్నాక ఇప్పుడు నెమ్మదిగా నడుస్తోంది. ఆచితూచి అడుగులు వేస్తోంది!
.......

No comments:
Post a Comment