**********************************
1. అడవి
అక్షరాలతో
అవసరం తీరిపోయింది
ఆర్ద్రతనిండిన పుటల్ని
అటకమీద చెదలు తినేశాయి
మస్తకాలకు పదునుపెట్టే పుస్తకాలకు
మరణదండన అమలుజరుగుతోంది
కలలకలాలు విరిగిపోతున్నాయి
బంజరుభూముల్లో చల్లుతున్న
ఆశల డిగ్రీలు మొలకెత్తటంలేదు
అవకాశాల ఎరువులు
అందరికీ అందడంలేదు
ఈవేళ కంప్యూటర్ మన భగవద్గీత
కంప్యూటర్ మన ఆదిగ్రంధం
అదే ఖురాను-అదే బైబిలు!
విలువల వేలంపాటలో
గ్లోబల్ గాలానికి చిక్కిన అనుబంధాలు!
హృదయస్పర్శ లోపించి
చల్లారిన కరచానాలు!
జనారణ్యంలో
బోధివృక్షం బూడిదైపోయింది
అహింస అడ్రసు పాతబడిపోయింది
పెద్దపులులు మెత్తగానే గాండ్రిస్తున్నాయి
తుపాకీలు శాంతియుతంగానే
తూటాలు కురిపిస్తున్నాయి
తక్షకులు తమ వాళ్ళందరికీ
రక్షణ కల్పిస్తూనే ఉన్నారు!
సర్దుబాట్లతో కల్తీ అయిన చైతన్యం
ఆలోచనల్నిపక్కదారి పట్టిస్తోంది
అవగాహన ఒకవైపుకీ
ఆచరణ మరోవైపుకీ లాగుతుంటే
ఉద్యమరధం ముందుకు కదలలేక
ఉసూరుమని నిట్టూరుస్తోంది!
జాతికి పట్టిన రోగాన్ని కుదర్చడానికి
డాక్టర్లు ఎక్కువైపోతున్నారు
జబ్బు మాత్రం తగ్గడంలేదు!
మిత్రులారా!
మనిషి చిరునామా
ఎప్పటికీ చెప్పలేమా?
నిజమే-
పోయినవాడికోసం
పొగిలిపొగిలి ఏడవడానికి
గుండెలో తడిఎక్కడుంది?
మానవస్మృతుల తాలూకు బెంగ
దగ్గరకు చేరకుండా
దేహం దడికట్టుకుంది!!
***************************
2. తపస్సు
నేను
ఉషస్సుకోసం
తపస్సు చేస్తున్నాను
ఇంద్రధనువుల్నీ,విద్యుదణువుల్నీ
మంత్రాలుగా పఠిస్తున్నాను
వెలవెలబోతున్న శిధిలసౌధాన్ని
వెలుతురుతో కడిగి శుభ్రం చేస్తున్నాను
లక్షనక్షత్రాలతో
ముంగిట్లో ముగ్గులు పెడుతున్నాను
ఆకలిశోకాలనూ,అజ్ఞానతిమిరాలనూ
అవతలకు తరిమేస్తున్నాను
భయంతో అణగారిన స్వరంలో
భాస్వరం వెలిగిస్తున్నాను
జనజీవన సౌందర్యాన్ని
కాటువేస్తున్న కర్కోటకులపైకి
అక్షరాలను ఆయుధాలుగా
ఎక్కుపెడుతున్నాను
చెమటచుక్కలో మెరిసే జీవశక్తిని
జెండాగా ఎగరేస్తున్నాను
జీవితం సిలబస్ లోంచి
చీకటిని తొలగించి
వేకువపాఠాలు చేరుస్తున్నాను
నేను
ఉషస్సుకోసం తపస్సు చేస్తున్నాను!
****************************************
3.జీవనాడి
అనుభూతిలేదు
ఆలోచనలేదు
అంతరంగాన్ని కదిలించే ఆర్ద్రతలేదు
ఇది-
కవిత్వం కంటనీరు పెడుతున్న సందర్భం!
గతితప్పిన గర్వంతో
ముక్కలౌతున్న గాంధారి గర్భం!
గమ్యాన్ని మరచిపోతున్న అస్పష్టత_
గమనాన్ని అడ్డుకుంటున్న సంక్లిష్టత_
కవిత్వం కళ్ళలో జిల్లేళ్ళు మొలిపిస్తున్నాయి
సాహిత్యవీధుల్లో పల్లేరుకాయలు చల్లుతున్నాయి
గతరాత్రి అరమోడ్పు వాతావరణంలో
సరిగ్గా జీర్ణంకాని విదేశీకవిత
వికృతమైన వమనంగా వెలుపలికొస్తుంది
ముళ్ళకంపల్లో చిక్కుకుపోయిన
కవితాచేలాంచలం
కంగారులో చిరిగిపోయి
చీలికలూ పేలికలూ అవుతుంది
భావదారిద్ర్యానికి
భాషాదారిద్ర్యం తోడవుతుంది
అలవాటుగా మారిన ఆత్మవంచనకు
పరవంచన జతకలుస్తుంది
పరాయిభాషలో దొంగిలించిన భావాలు
పంజరంలో పక్షుల్లా పరితపిస్తుంటాయి
తల్లిలేని పిల్లల్లా అలమటిస్తుంటాయి
నుడికారం లోపించిన పదాల్లో
జీవనాడి పడిపోతుంది
అక్షరం తన ఆత్మను పారేసుకుంటుంది
సారెమీద మృత్తికతో నృత్యంచేయించి
ప్రాణంపోసినట్టు-
ఉలితో శిలకు ఊపిరులూది
శిల్పం చెక్కినట్టు-
మాటల్ని మధించాలి
పదాలకు పదునుపెట్టాలి
కలంతో తయారుచేసిన బొమ్మ
కళ్ళముందు సజీవంగా సాక్షాత్కరించాలి
తన ఆలోచనల్ని
నీతో కలబోసుకోవాలి
తడిఆరని అక్షరాలు
తమస్సులో తొలిపొద్దులు మెరిపించాలి!
మనస్సులో సరిహద్దులు చెరిపెయ్యాలి!!
*******************************************
4. అక్షరం
అక్షరానికి ఆకారమేకాదు-
ఆలోచనకూడా ఉంటుంది
సదసద్వివేకాన్ని
సాధించిన అక్షరానికి
భాషమాత్రమేకాదు-
అనంతరహస్యాలు శోధించే
లోతైన చూపుకూడా ఉంటుంది
నీచుట్టూ పరిసరాలు
అబద్ధాలపడగలెత్తి
బుసలు కొడుతున్నప్పుడు
శరీరాలు కీలుబొమ్మలై
నడకలూ నడతలూ
యాంత్రికంగా మారినప్పుడు
స్వచ్చమైన అభిప్రాయాలు
సంకెళ్ళలో చిక్కినప్పుడు
ఆకుపచ్చని అనుభూతులు
అగ్గిలోకి దూకినప్పుడు
అక్షరం
తన ఆత్మను ఆవిష్కరిస్తుంది!~
ఏ సందర్భమైనా
తనలో ప్రతిబింబిస్తుంది
ఏ సన్నివేశమైనా
తానై ప్రతిఫలిస్తుంది
సమస్త ప్రకృతినీ
ఆవాహన చేసుకున్న అక్షరం
కరుణనిండిన కాసారమౌతుంది
అరుణవర్ణపు కల్హారమౌతుంది
చంద్రుడిలా వెలుగుతుంది
నక్షత్రంలా మెరుస్తుంది
సహనం చెరిగిపోయినపుడు
సూర్యుడిలా జ్వలిస్తుంది!
ప్రపంచాన్నే జయిస్తుంది!!
*****************************************
5. జీవితం
జీవించడం తెలియని జీవితం
చావలేక జీవిస్తోంది!
జీవించడం మరచిన జీవితం
శవంలాగ జీవిస్తోంది!
అప్పుడెప్పుడో
అనంతవిశ్వంలాంటి అమ్మఒడిలో
ఆనందం వెల్లువలై పొంగిన రోజుల్లో-
అణువణువునా ఆత్మీయరాగాలు
అందమైన పద్యాలై వెలిగిన క్షణాల్లో-
ఈ జీవితం ఎంతబాగుండేది!
వినువీధిలో విరిసిన హరివిల్లూ
వెండివానలా కురిసిన వెన్నెలజల్లూ
విచిత్రవేషాలు వేసే మబ్బుతునకా
విడువలేని సౌరభాన్నిపంచే మల్లెమొగ్గా
ఎంత ఆనందాన్నో పంచిపెట్టేవి!
వింతకాంతులతో నన్ను చుట్టుముట్టేవి!
అప్పుడు-
ఆవేశకావేషాలు లేవు
కసీకార్పణ్యాలు తెలియవు
అసూయలేదు ఆత్మవంచనలేదు
అసలు ఆనందం అనే పదం తప్పించి
అన్యవిషయాలు తెలియని
దివ్యానుభూతి ఆ జీవితం!
కానీ ఈవేళ-
జీవితం ద్వేషిస్తోంది
జీవితం దూషిస్తోంది
ఆశలను బాధిస్తోంది
శ్వాసలను వేధిస్తోంది
అవును-జీవితం జీవితాన్ని శాసిస్తోంది!
క్రీస్తు శరీరాన్ని
కౌగలించుకున్న శిలువ సాక్షిగా-
సోక్రటీస్ పెదాలను
ముద్దాడిన విషపాత్ర సాక్షిగా-
జీవితం జీవితాన్ని ఏడిపిస్తోంది!
ఆశల ఆకాశ శిఖరాలనుంచి
అట్టడుగు అఖాతాల్లోకి విరిగిపోతున్న
చేతగానివాడి ఆలోచనలా-
సృష్టికర్త చేతిలోంచి జారిపడి
పగిలిపోయిన గాజుపాత్ర-జీవితం!
పడగవిప్పిన చాందసత్వం
పఠిస్తున్న అసురవేదం- జీవితం!
మతమౌఢ్యపు విషవలయంలో
మానవత్వం చేస్తున్న ఆర్తనాదం- జీవితం!
అభిప్రాయాలకూ ఆచరణకూ పొంతనలేకుండా
తలనిండా సాలెగూళ్ళు నిర్మించే
అధివాస్తవికచిత్రం-జీవితం!
అసమర్ధ గాయకుడి గొంతులో
శ్రుతితప్పిన ఆలాపన-జీవితం!
మనకు ఏం కావాలో-మనం ఏం చెయ్యాలో
మనకే తెలియని గందరగోళం-జీవితం!
ఉనికే ఎరుగని మాయాజాలం-జీవితం!
జననమరణాల మధ్యకాలంలో
ఎందుకోసమో-దేనికోసమో
అర్ధంకాని అన్వేషణ-జీవితం!
మొహెంజొదారో వీధుల్లో వెలసిన
మహోన్నతమైన నాగరికతనుంచి-
ఈజిప్టు పిరమిడ్ల గుండెల్లో నిలచిన
అంతుపట్టని సాంకేతిక విలువలనుంచి-
హీరోషిమా నాగసాకీల విధ్వంసంలోకి దూకి
ఆత్మాహుతిచేసుకున్న శిధిలసౌందర్యం-జీవితం!
ఎప్పటికీ పూర్తికాని అసమగ్రసౌధం-జీవితం!
ఎవ్వరికీ అర్ధంకాని అసంబద్ధకావ్యం-జీవితం!
అనుక్షణం బాధించే మాననిగాయం-జీవితం!
మనసును పట్టి వేధించే రాయని గేయం-జీవితం!
మన ఆలోచనల్ని ముక్కలు ముక్కలు గావించి
మన ఆవేదనల్ని లెక్కకు మిక్కిలి గావించి
తనలో తాను ఆనందించే శాడిస్టు ఈ జీవితం!
చివరకు మనకు మనమే బరువుగా తోచే
పిరికితనానికి పర్యాయపదం-జీవితం!
జుగుత్సాకరమైన ప్రపంచనాటకంలో
బీభత్సరసానికి పరాకాష్ఠ మన జీవితం!
అందుకే-
జీవించడం తెలియని జీవితం
చావలేక జీవిస్తోంది!
జీవించడం మరచిన జీవితం
శవంలాగ జీవిస్తోంది!!
*************************************************
6. బతుకు పుస్తకం
బతుకు పుస్తకంలో
బానిసభావాలు ఓనమాలు నేర్పుతున్నాయి
బండబారిన మస్తకంలో
ఆలోచనలు మత్తుగా ఆవలిస్తున్నాయి
బతుకులెక్కల్లో వాడికి
బాధలకు బాధలు కలిసి కూడికలవుతాయి
చిరునామాలు చెరిగిన సుఖాలు
తీసివేతలవుతాయి
వేదనలూ రోదనలూ
గుణించబడతాయి
అవకాశాలు అవరోధాలతో
భాగించబడతాయి
వాడుపలికేది వాడిమాటకాదు
వాడుపాడేది వాడిపాటకాదు
ఎవరి ఊరేగింపులోనో
ఎవరెవరికో జేజేలు కొడుతున్నాడు
పేరుమరచిన ఈగలా
తనకు తానే పరాయివాడైపోతున్నాడు
అద్దంలో తన ప్రతిబింబాన్నిచూసి
ఎవరిదో అని అనుమానపడతాడు
పచ్చని కలల్ని వేటాడుతున్న హంతకుల్ని
పక్కనేఉన్నా గుర్తించలేడు
వాడు‘వాడి’లోపించినవాడు
వాడు‘వేడి’చల్లారినవాడు
చీకటి వాడి సిద్ధాంతం
నిరాశ వాడి వేదాంతం
బిగించవలసిన పిడికిళ్ళను
జోడించిన చేతులుగా మార్చుకుంటున్నాడు
అడుగడుగునా అవమానాలను
పూర్వజన్మఫలాలుగా ఓర్చుకుంటున్నాడు
అనంతంగా విస్తరించిన అరణ్యాల్లో
విలువైన శ్రమను అమ్ముకుంటున్నాడు
ఆనందాన్ని పరిహరించిన ఎడారుల్లో
విలువలేని శ్రమను నమ్ముకుంటున్నాడు
సమాజం-
వాడి ముఖంలో సంతోషాన్ని నిషేధించింది
వాడి సుఖంమీద నిరవధిక కర్ఫ్యూ విధించింది
శిశిరశాపాలూ గ్రీష్మతాపాలూ
కసిగా కాటేసిన జీవితాన్ని
ఏ వసంతం పల్లవింపజేస్తుంది?
ఏ సుగంధం పరిమళింపజేస్తుంది?
ఆకలైనా శోకమైనా
అంతరంగంలోనే అణగిపోతుంది
తడారిన ఎడారిలో
గొంతు ఎండిపోతే
కన్నీటిస్పర్శ ముఖాన్ని పరామర్శిస్తుంది
అరిగిపోయిన ఆలోచన
అచ్చుకు నోచుకోని
ఆర్తగీతమై మిగిలిపోతుంది
చెదలు తినేసిన బతుకు పుస్తకం
ముసురుకున్న విషాదంతో
ముఖచిత్రం కోల్పోతుంది!
****************************************
7. పాడుపడిన చిత్రాలు
గాలికూడా కదలదు
గదినిండా ఒకటే భయం!
ప్రాణాన్ని వెలిగించే ఆలోచనలమీదకు
ప్రతిమూలా ఎక్కుపెట్టిన ప్రమాదాలు!
గోడకు వేలాడదీసిన బొమ్మల్లో
అడుగడుగునా అంగవైకల్యాలు!
ఈ మనుషులందరిలోనూ ఏదో లోపం
నిజానికి వీళ్ళకు జీవితమే పెద్ద శాపం!
వీళ్ళంతా వెన్నెముకలు లేకుండా
ఎలాపుట్టారు చెప్మా!?
బహుశా బ్రహ్మదేవుడు
ఏ బస్సు ప్రమాదంలోనో యిరుక్కుని
ఆసుపత్రిలో అఘోరిస్తున్నప్పుడు
ఊసుపోక సృష్టించి ఉంటాడీజనాన్ని!
*********************************************
8. గాజు కళ్ళు
పంజరంలో అనుభవాలు
ఫక్కుమని వెక్కిరించాయి
ఆలోచనల కీకారణ్యంలో
అక్షరాలు తప్పిపోయాయి
పుటలు తిరగేస్తుంటే
మసకగా అనిపించింది
తీరాచూస్తే
కళ్ళజోడుతోపాటు
కళ్ళుకూడా చిట్లిపోయాయి!
*****************************************
9. పిచ్చి గీతలు
చిల్లరంతా జారిపోయాక
జేబుచిరిగిన విషయం తెలుస్తుంది
సమయంకాస్తా దాటిపోయాక
ఆవేశం ఆయాసంగా మిగులుతుంది
నీ నీడే నిన్ను విడిచిపెట్టి
కాలుమీద కాటెయ్యబోతుంది
వంకరగా మలుపు తిరుగుతున్నప్పుడు
నువ్వెక్కిన రైలే నిన్ను తరుముకొస్తుంది!
10.ఇది ఎలిజీ కాదు
కలల కుటీరం
కాలిపోయింది!
వెలుగుతున్న నక్షత్రం
విరిగిపడిపోయింద్!
నా నరాల్లో ప్రాణాన్ని ప్రవహింపజేస్తూ
నీ నవ్వు మధ్యలో తెగిపోయి
ఏ చెట్టుకొమ్మల్లో ఇరుక్కుపోయిందో!
ఏ పిట్ట తనముక్కున కరుచుకుపోయిందో!
చిరునామా చెరిగిపోయినా
అరవిరిసిన నీ నవ్వు మాత్రం
నా గుండెల్లో స్మృతిగీతమై
మండుతూనే ఉంటుంది!
*********************************
11. గ్లాస్ నోస్త్
రోగం తగ్గలేదు
బాగుపడాలని వేసినమందు
భయంకరంగా వికటించింది
కళ్ళకు గంతలు కట్టుకున్న గానుగెద్దులు
గాడిచుట్టూ తిరుగుతూ
జైత్రయాత్రగా భ్రమపడ్డాయి
గాడిదలూ ఏనుగులూ
గమ్యం త్వరగా చేర్చలేవని
ఎర్రగుర్రం ఎక్కితే
అది వెనక్కి పరుగెడుతోంది
శిధిలమైన యౌవనానికి
ఇనుపతెరల బ్రాసరీలు బిగించికట్టి
ముసలిరంభ నాట్యం చేస్తోంది
సరిగ్గా చూస్తే-
ముఖంలో గాజుకళ్ళు!
పెదాలమీద ప్లాస్టిక్ నవ్వులు!!
**********************************
12. శవయాత్ర
ఆశలగురించీ ఆశయాలగురించీ
అనర్గళంగా చెప్పాలనేఉంది
నిరాశకు మరణదండన విధించి
తిరుగుబాటు గీతాలు పాడాలనే ఉంది
కేన్వాసుమీద చిత్రాలు చూస్తే
అయోమయంగా రూపాలు మార్చుకుంటున్నాయి
పసిడి స్వప్నాలు
పత్రహరితాన్ని పారబోసుకుంటున్నాయి
ఆచరణలేని అవగాహనా
అవగాహన లోపించిన ఆచరణా
మూడడుగులు ముందుకీ
ఏడడుగులు వెనక్కీ గెంతుతున్నాయి
ప్రశ్నించడం మరచిపోయిన జాతిని
బంగారు సంకెళ్ళతో సత్కరించారు
చూపుడువేలు తెగ్గోసుకున్న చేతిని
గురిపెట్టిన తుపాకీగా చమత్కరించారు
అవకాశవాదులు తలపెట్టిన
అయ్యవారిబొమ్మ
కోతిరూపాన్ని పూర్తిచేసుకుంది
జీవకళ కోల్పోయిన శిధిల కంకాళం
శ్మశానంలో సమభావం సందర్శించబోతోంది
పట్టుకున్న తాడు పామై కరచినట్టు
నీడనిచ్చే చెట్టుకొమ్మ విరిగి నెత్తిమీదపడ్డట్టు
ఒకటే ఆవేదన!
ఒకటే ఆందోళన!
అవమానాల పరంపరలో
ఆలోచనలు బావురుమంటున్నాయి
కొత్తగా మిత్రులైన శత్రువులంతా
పాడె కట్టడంలో సహకరిస్తున్నారు
శవయాత్రలో ఊరేగడానికి
ఉన్మాదులంతా ఉత్సాహపడుతున్నారు
అభ్యుదయంకంటే పతనంలోనే
అఖండమైన ఆనందాన్ని వెదుక్కుంటూ
తప్పుదారిపట్టిన పరిపాలన
తన తలకు తానే నిప్పు పెట్టుకుంటొంది
అందుకే ఈవేళ
కూలిపోతున్న విగ్రహాలగురించీ
రాలిపోతున్న నక్శత్రాలగురించీ
ఎలిజీ రాస్తున్నాను!
విరిగిపోయిన సుత్తిగురించీ
పదునుపోయిన కొడవలిగురించీ
బాధను ప్రకటిస్తున్నాను!!
13. అజ్ఞానధనులు
మానవత్వానికి పట్టం కట్టినవాడా!
జనంమాటల జెండా పట్టినవాడా!
మహాకవీ! గురజాడా!
వీళ్ళ అజ్ఞానానికీ ఆటవికత్వానికీ
అక్షరాయుధాలతో
శస్త్రచికిత్స చెయ్యాలనుకున్నావు
మనసున్న మనుషులుగా మార్చాలనుకున్నావు
భూతవైద్యాలకూ నాటుపద్ధతులకూ
అలవాటుపడ్డవాళ్ళు
అసలు నువ్వు వైద్యుడివే కాదన్నారు
నీ అవసరమే లేదన్నారు
మహాకవీ!
వీళ్ళరోగాలు ఇంకా తగ్గలేదు
సహజీవనానికి సమాధి కట్టేశారు
కులమతాల కోరలకు
కొత్తగా పదును పెడుతున్నారు
ఇంతులను ఇతోధికంగా గౌరవిస్తున్నారు
పూటకూళ్ళమ్మకూ మీనాక్షికీ
అభిమానసంఘాలు పెడుతున్నారు
‘ఒపీనియన్స్ చేంజ్’చేస్తున్న పొలిటీషియన్లు
గిరీశాన్ని గురుస్థానంలో నిలబెడుతున్నారు
నువ్వు ఎగరేసిన దేశభక్తి కపోతాలు
ఎటుపోయాయో తెలియక
ఇంకా వెతుకుతూనే ఉన్నారు
స్విస్ బేంక్ ఖాతాలతోనూ
అవినీతి కుంభకోణాలతోనూ
దేశాన్ని ప్రెమిస్తూనే ఉన్నారు
సొంతలాభాన్ని కొంతమాత్రమే మానుకొని
రక్షణ రహస్యాలు సైతం అమ్ముకుంటూ
పొరుగువాడికి తోడ్పడుతున్నారు
వట్టిమాటలు కట్టిపెట్టి
గట్టి బాంబులతో కొట్టుకుంటున్నారు
మహాకవీ!
సిగ్గువిడిచి చెబుతున్నాను-
వీళ్ళరోగాలు ఇంకా తగ్గలేదు!
భావాలు ఇంకా మారలేదు!!
*********************************
14. ప్రోగ్రెస్ రిపోర్ట్
నేను
పతాకానికి నమస్కరిస్తున్నాను!
అనేక కోట్లమంది అజ్ఞానాన్నీ
అధికారమదోన్మత్తుల అహంకారాన్నీ
సహిస్తున్న సౌమ్యమూర్తి
పతాకానికి నమస్కరిస్తున్నాను!
గుడ్లగూబల కుట్రలనూ
గుంటనక్కల నంగనాచివేషాలనూ
నిండుమనసుతో క్షమించి
రెపరెపా నవ్వుకుంటున్న పతాకానికి
శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను!
పతాకంమీద ప్రమాణంచేసి
అంతా నిజమే చెబుతున్నాను!
ఈవేళ
పతాకంలో రంగులకు
అర్ధాలు మారాయి
త్యాగం, శాంతి, సౌభాగ్యాలు
వ్యర్ధపదాలుగా మిగిలాయి
అమాయకులమీద అత్యాచారాలతో
కాషాయం కసాయితనం ప్రదర్శిస్తోంది
పలాయనం పఠించిన శాంతిని చూసి
తెలుపు తెల్లబోతోంది
రత్నగర్భలో ఆకలిచావుల దౌర్భాగ్యాన్ని
ఆకుపచ్చ వెక్కిరిస్తోంది
నేను పతాకంమీద ప్రమాణం చేస్తున్నాను!
మీ అందరిముందూ నిజం చెబుతున్నాను!
అభివృద్ధిపధంలో
పధకాల గొంగళీలు
ఎక్కడ వేసినవి అక్కడే ఉంటున్నాయి
సామాన్యుడి సమస్యలన్నీ
ఏడవ నంబరు చేపల్లా
ఎండకుండా మిగిలిపోతున్నాయి
ఇక్కడ ఆచరణ కరెంటులేకుండా
వాగ్దానాల స్విచ్ లు నొక్కుతున్నారు
దయచేసి ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ చదవనివ్వండి!
మనసారా మీముందు ఏడవనివ్వండి!
అంతులేని అరాచకత్వంతో
హింస పరమ ధర్మమవుతోంది
అసత్యమే అన్నిటినీ జయిస్తోంది
కులమతభేదాలు సంకుచితభావాలూ
అన్నిరంగాల్లోనూ అడుగడుగునా మోసాలూ
ఈ జాతి నరాల్లో నాట్యం చేస్తున్నాయి
చెవుల్లో వేదమంత్రాలుగా మారుమోగుతున్నాయి
గాయపడ్డ మనసుల్ని
ఓదారుస్తూనే ఉన్నారు
కట్టుకట్టేవాడే కనిపించడంలేదు
ప్రజాస్వామ్య పరిరక్షణకోసం
పావురాలను చంపి
శాంతియాగాలు చేస్తున్నారు
దయ్యాలు వేదాలు వల్లిస్తుంటే
ధరిత్రి సిగ్గుపడుతోంది
చరిత్ర తలవంచుకుంటోంది
నేను పతాకానికి నమస్కారం చేస్తున్నాను!
చెప్పలేనంత సిగ్గుతో సెలవు తీసుకుంటున్నాను!!
*****************************************
15. పెళ్ళికాని పిల్ల
ఈ పిల్లకు పెళ్ళికావడంలేదు
మనుమల్ని ఎత్తుకునే వయస్సొచ్చినా
మనువాడేవాడు దొరకడంలేదు
జోళ్ళరిగిపోయేలా తిరుగుతున్నాము
ఏళ్ళు గడచిపోతున్నా వెదుకుతున్నాము
అయినా ఈ పిల్లకు పెళ్ళి కుదరడంలేదు
దొరల చెరలోనుంచి బయటపడ్డ బిడ్డను
అల్లారుముద్దుగా పెంచుతున్నాము
కంటికి రెప్పలా కాపాడుతున్నాము
సుజలాం సుఫలాం కీర్తనలతోనూ
సుప్రభాతగీతాలతోనూ
సంగీతం చక్కగా ఒంటపట్టించుకుంది
పుట్లకొద్దీ పుణ్యం తెచ్చిపెట్టే
పురాణాలన్నీ పుక్కిట పెట్టుకుంది
పక్కవాళ్ళ యిళ్ళకు తిరిగితే
పాడుబుద్ధులు పట్టుబడతాయని
పసితనంనుంచే పంజరంలో ఉంచాము
సీత గీతదాటిన ఫలితాన్ని
నరాల్లో నారుపోసి మరీ పెంచాము
తూర్పుగాలికి పిల్ల ఆరోగ్యం చెడిపోతుందని
తలుపులూ కిటికీలూ ఎక్కువగా తెరవడంలేదు
పడమటిగాలి మోసుకొస్తున్న కాలుష్యాన్ని
టీవీల్లోనూ వీక్లీల్లోనూ భరించక తప్పడంలేదు
అయినా రోగమో రొచ్చో వస్తే
ఆకుపసరు వైద్యాలు చేయిస్తూనే ఉన్నాము
స్కాముల్లోనో-
గడ్డివాముల్లోనో ఇరుక్కుంటే
గుట్టుచప్పుడు కాకుండా నెట్టుకొస్తున్నాము
అరచేతులు అడ్డుపెట్టి
మాఇంటి దీపాన్ని కాపాడుకుంటున్నాము
మరచెంబులోని గంగాజలంతో
తప్పులన్నీ శుద్ధిచేసుకుంటున్నాము
అయినా ఏమనుకుంటే ఏమి లాభముంది?
కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది!
పచ్చగాఉంటే పక్కవాళ్ళే కుళ్ళిపోతున్నారు
మచ్చలున్నాయని ప్రచారంచేసి
వచ్చినవాళ్ళను వెళ్ళగొడుతున్నారు
ఏమాటకామాటే చెప్పుకోవాలి
ఇప్పుడైనా మనసుల్ని విప్పుకోవాలి
వచ్చినవాళ్ళు మాక్కూడా
నచ్చిచావడంలేదు
సంప్రదాయమూ చట్టుబండలూ
ఉండి ఏడవడంలేదు
కులం గోత్రం చూడకుండా
పిల్లనెలా ఇస్తాము?
గుర్రాలకూ కుక్కలకే పెడిగ్రీలు చూస్తుంటే
కుర్రవాడి విషయంలో ఎలా ఊరుకుంటాము?
కులాలు మతాలు నశించాలని కేకలుపెట్టినా
సాటివాడికే వోటు వేస్తున్నాము
తప్పనిసరి అనుకుంటే
అయినవాడికైనా వెన్నుపోటు పొడుస్తున్నాము
అయిదేళ్ళూ పూర్తికాకుండానే
ఆపదమొక్కులు చెల్లిస్తున్నాము
అవసరమైనప్పుడల్లా
ఉపన్యాసాల తుక్కును జల్లిస్తున్నాము
బతికుండగా బద్దలైన పెద్దవాళ్ళ పరువును
మరణించాకా అందలమెక్కిస్తున్నాము
అడుగడుక్కీ అడ్డుతగిలేలా
వీధుల్లో విగ్రహాలు నిలబెడుతున్నాము
తాతలు తాగిన నేతుల వాసన
వాడవాడలా గుబాళింపజేస్తున్నాము
అయినా ఈ పిల్లకు పెళ్ళికావడంలేదు
అంగట్లో అన్నీఉన్నా
అల్లుడు మాత్రం దొరకడంలేదు
మంచీ మర్యాదా తెలిసినవాడు
మచ్చుకైనా కనిపించడం లేదు
‘ఆత్మవత్సర్వభూతానీ’అంటే
‘అందరిసొమ్మూ నాకేరానీ’అని వెక్కిరిస్తున్నాడు
సహనమే సౌందర్యమని చెబితే
ఓర్పు గాడిదల లక్షణమని ఎదురు చెబుతున్నాడు
పుణ్యం పురుషార్ధం తెలియనివాళ్ళు
కొండల్లోనూ అడవుల్లోనూ
కొత్తసూత్రాలు జపిస్తున్నారు
భాజాభజంత్రీలు కాదు-
బాంబులూ బందూకులూ అంటాడు ఒకడు
కరచాలనం మానేసి
ఖడ్గచాలనం చేస్తానంటాడు ఇంకొకడు
‘చేసుకున్నవాళ్ళకు చేసుకున్నంత’అనుకోకుండా
మనుషులంతా ఒక్కటే అంటున్నారు
మతాలన్నీ చీకటే అంటున్నారు
రామరాజ్యం గురించి మేము నచ్చచెబుతుంటే
శంబూకుడి పేరుచెప్పి రెచ్చగొడుతున్నారు
బరితెగించినవాళ్ళు-
పెద్దలమీద గురి నశించినవాళ్ళు-
ఉద్రేకంతో పిడికిళ్ళు బిగించినవాళ్ళు-
విప్లవాలూ తిరుగుబాట్లూ అంటూ
వీరంగం తొక్కుతున్నారు
పెద్దంతరం చిన్నంతరం లేకుండా
పేట్రేగిపోతున్నారు
ఇలాంటివాళ్ళతో ఎలా వేగాలో చెప్పండి
నిప్పుకీ నీటికీ పొత్తుకుదరదు ఇక పొండి!
ఇంకెందుకులెండి చెప్పుకుంటే సిగ్గుచేటు-
ఇప్పటికే ఈ పిల్లకు పెళ్ళివయసు బాగాలేటు!
*******************************************
16. జైలునుంచి జైలుకి
సుతారంగా పల్లవిస్తున్న పసితనం
హఠాత్తుగా బండబారిపోతుంది
స్వచ్చంగా కనిపిస్తున్న చిరునవ్వు
సింధటిక్ రూపాన్ని సంతరించుకుంటుంది
ట్వింకిల్ ట్వింకిల్ కాన్వెంట్లు
అమ్మతనంలో ఆత్మీయతనుకూడా
అక్షరాలా ఆంగ్లీకరిస్తాయి
‘మిస్’ల పర్యవేక్షణలో
అచ్చమైన అనుభూతి మిస్సవుతుంది
ఉషోదయంలా మెరిసే బంగారు బాల్యం
ఉసూరుమంటూ నీరుకారిపోతుంది
భవిష్యత్తులో మూటలుమోసే కూలీలకు
బాల్యంనుండే ప్రాక్టీసు మొదలవుతుంది
ఉరకలువేసే వయస్సునూ
పరుగులుతీసే మనస్సునూ
రెసిడెన్షియల్ మబ్బులు కమ్ముకుంటాయి
స్వేచ్చగా సాగే సూర్యరధాన్ని
పుస్తకాల శిఖరాలు అడ్డుకుంటాయి
వాతలుపెట్టుకున్న నక్కల్లా
పల్లెలు పట్నాలవైపు దారితీస్తాయి
ప్రాణాధారమైన పచ్చదనాన్ని ధారపోస్తాయి
తలలు తాకట్టుపెట్టి తెచ్చిన ఇం‘ధనం’
కోచింగుల వేసవిలో ఆవిరైపోతుంది
క్రమశిక్షణలో క్రమం లోపించి
శిక్షలు మిగులుతుంటాయి
ఆటవిడుఫులేని అక్షరాల ఫేక్టరీల్లో
ఆత్మహత్యలు రగులుతుంటాయి
చెట్టుమీద పక్షికన్నులాంటి రేంకుల్ని
కొట్టే మొనగాళ్ళు కొందరే ఉంటారు-
అంగబలమూ అర్ధబలమూ లేనివాళ్ళు
అంగరాజులై ఆగిపోతుంటారు
శాపగ్రస్తులై మిగిలిపోతుంటారు
బతుకు విశ్వరూపం
బట్టబయలవుతుంది
అవినీతిని చట్టబద్ధంచేసిన అసురసంధ్య
అట్టహాసంగా అడుగుపెడుతుంది
చిద్విలాసంగా ముసురుకుంటున్న చీకటి
కలలుగనే కళ్ళలో కారం కొడుతుంది
తెగినజోడులాంటి చేతగానితనం
నడకను అస్తవ్యస్తం చేస్తుంది
చిన్నజైలునుంచి పెద్దజైలుకి
జీవితం ట్రాన్స్ ఫర్ అవుతుంది!
**************************************
17. బఫె-లో కల్చర్
ఆకుపచ్చని పందిళ్ళు
రంగుగుడ్డల షామియానాలుగా
వేషాలు మార్చుకున్నాయి
అరిటాకులో అన్నం
అవుట్ డేటెడ్ అయింది
పప్పూదప్పళాలు
అప్పగింతలు పెట్టేశాయి
పాలక్ పన్నీరులూ పూల్ మకానాలూ
దేశవాళీకూరలకు
దిక్కులేకుండా చేశాయి
కుదురుగా కూర్చుని తినడం గౌరవానికి భంగం
చిప్పకూడు కోసం హేమాహేమీల వీరంగం!
పరాయీకరణ చెందిన సంస్కృతిలో
సందర్భం ఏదైనా కావచ్చు-
సందడే సందడి!
కంటెస్సాల్లోనూ టయోటాల్లోనూ
కలకలలాడుతూ దిగిన కల్చర్ కి
కాస్సేపటికే మేకప్ చెరిగిపోతుంది
హఠాత్తుగా అందరికీ
నెత్తిమీద కొమ్ములూ
వీపువెనుక తోకలూ మొలుస్తాయి
బఫే మొదలైనవెంటనే
మనిషిలోని ‘బఫెలో’ విజృంభిస్తాడు
బకాసురిడినో ఘటోత్కచుడినో
ప్రతివాడూ ఆవాహన చేసుకుంటాడు
బతగడం కోసం తింటున్నట్టు కాకుండా
తినడం కోసమే బతుకుతున్న భావన
బహిరంగంగా బట్టలు విడుస్తుంది
చల్లారిన కరచాలనాలతో
చచ్చుబడిన చేతులలోకి కొత్తశక్తి ప్రవేశిస్తుంది
పళ్ళాలు పట్టుకుంటూ
పక్కవాళ్ళను నెట్టుకుంటూ
చేతులు అష్టావధానం చేస్తాయి
జుగుప్సకు పరాకాష్ఠగా నిలచిన
ఎదుటివాడి ముఖకవళికలనూ
వెనుకవాడి నోటిచప్పుళ్ళనూ
‘గురివిందలు’ అసహ్యించుకుంటాయి
ఎంగిలాకుల దగ్గర కుక్కల్లా
ఎంత కోలాహలం!
ఇంతకూ వచ్చిన చిక్కల్లా
అంతరంగాలనిండా కశ్మలం!!
************************************************
18. చేదుపాట
స్వరానికి జ్వరం తగిలింది
స్వప్నంకూడా స్వతంత్రం కోల్పోయింది
అశాంతినిండిన అసావేరి
అక్షరాలను ఆక్రమిస్తోంది
పరిహాసంగా ఓండ్రపెడుతున్న గాడిదలు
పాటకు పాడె కడుతున్నాయి
ఈవేళ ఏమని పాడమంటారు?
ఏ రాగాన్ని పలికించమంటారు?
పెదాలమీద అందరూ
పిచ్చినవ్వులు అతికించుకుంటున్నారు
చేదుభావాలకు అందంగా
చక్కెరపూత పెట్టుకుంటున్నారు
అందరూ మహానుభావులే-
ఆత్మవంచన తప్పడంలేదు!
ఉపన్యాసాల ఉద్రేకాన్నీ
ఊరేగింపుల ఉత్తేజాన్నీ
వాయిదా వేస్తున్న ప్రవక్తలు
ఏసీ ఆశ్రమాల్లో
విప్లవాలు ఆవిష్కరిస్తున్నారు
గుడిసెమీద ఎగరాల్సిన జెండాను
మేడపైకి ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు
ఆశయాల మర్రిచెట్లు
ఆచరణ గోడలమధ్య
బోన్ సాయ్ మొక్కలుగా మారిపోతున్నాయి
సామాన్యుడి వలలోపడ్డ అవకాశాలు
తాళ్ళుకొరికేసి తప్పించుకుపోతున్నాయి
రేపటి నిరుద్యోగ పిశాచం
నేటి విద్యాలయాల్ని పట్టుకొని వేలాడుతోంది
అసంతృప్తి ఉష్ణోగ్రత అదుపుతప్పి
బస్సులూ రైళ్ళూ తగలబడుతున్నాయి
ఎటుచూసినా ఎక్కిళ్ళూ ఏడుపుల మధ్య
ఈవేళ ఏమని పాడమంటారు?
ఏ రాగాన్ని పలికించమంటారు?
స్వరానికి జ్వరం తగిలింది!
స్వప్నంకూడా స్వతంత్రం కోల్పోయింది!!
***************************************
19. మానవత
విశ్వరహస్య సంశోధనలో
వెన్నెలరాజు గుండెలమీద
కాలుమోపిన
కాలాంతకుడు మానవుడు!
పరిశోధన నాళికలో
పసిపాపను సృష్టించి
పరమాద్భుతం చేసిన
దేవాంతకుడు మానవుడు
స్వార్ధంతో
సాటి మనిషి రక్తాన్ని
చప్పుడుకాకుండా పీల్చేస్తున్న
నరాంతకుడు కూడా మానవుడే!
**************************************
20. నాలుగో సింహం
ఇక్కడ
జెండాల గాలాలకు
వాగ్దానాల ఎరలు కట్టి
అధికారం చేపలు పడుతున్నారు
ఇంతా చేస్తే
పాతపుస్తకాలకే
కొత్త అట్టలు తగిలిస్తున్నారు
గాలి కదిలితే నేరం
ఆకు మెదిలితే అపరాధం
అడవిలో చెట్లు తుపాకీలు పూస్తున్నాయి
మెదడులో ఆలోచనలు
డైనమైట్లు పేలుసున్నాయి
జైళ్ళ మొసళ్ళు నోళ్ళు తెరిచి
జనం కోసం చూస్తున్నాయి
ధర్మస్తూపంలోని నాలుగో సింహం
కర్మగాలిన ప్రజాస్వామ్యాన్ని చూసి
సిగ్గుతో మొహం చాటువేస్తోంది!
ఇది కలలు కాలిపోతున్న వేళ!
తీతువుల వికృత స్వరమేళ!!
*************************************
21. దారితప్పిన వాక్యం
దారినిండా ముళ్ళు
దాపులో తోడేళ్ళు
తడబాటుపడుతున్న కాళ్ళు
అడుగడుగునా ప్రలోభాల సంకెళ్ళు
పొగచూరిన ప్రయాణంలో
పొంచివున్న ప్రమాదాలు!
విల్లు ఎక్కుపెట్టిన రాముడికి
చేతులు వణుకుతున్నాయి
సమరరంగంలో సత్యభామ
సందిగ్ధంలో పడిపోయింది
శిశుపాలుడి తప్పులు లెక్కపెడుతున్న కృష్ణుడు
అంకెలు మరచిపోయాడు
స్తంభంలోంచి నరసింహుడు
బయటకు రావడం లేదు
జెండాల రంగులు మాసిపోతున్నాయి
ఎజెండాలో అంశాలు మారిపోతున్నాయి
జనసమూహంలోంచి జారిపోయిన వాక్యం
కంప్యూటర్ దుప్పటి కప్పుకొని
అమెరికా కలలు కంటూ ఆదమరచి నిద్రపోతోంది!
************************************
22. స్వేచ్చ
పావురాల కళ్ళలో
పాలనురుగులా ప్రతిఫలించే
శాంతికి శిలువ వెయ్యకు!
విచక్షణలేని
విచ్చలవిడితనంతో
జీవితద్వారానికి
నిప్పుల తోరణాలు కట్టకు!
రేపటి మానవుడు పాడుకునే పాటలో
అపశ్రుతిగా అవతరించకు!
పాడుపెట్టే చేతలకు కాదు-
పాటుపడే చేతికి స్వేచ్చ కావాలి!
చెట్టుకొట్టేవాడికి కాదు-
మొక్కనాటేవాడికి స్వేచ్చ కావాలి!
జాతి జీవితంలో
కాలకూటాన్ని కక్కుతున్న
కర్కోటకుల స్వేచ్చను
కచ్చితంగా అరికట్టాలి!
************************************
23. పునర్విమర్శ
గుప్పెడుచోటులో
గూడుకట్టుకున్న గుండె-
ఎన్నో వసంతాలు
ఎన్నెన్నో వడగాడ్పులు
అన్నిటినీ భద్రంగా స్వీకరిస్తుంది
ఎన్నయినా ఓపికగా సేకరిస్తుంది
కళ్ళ సంకెళ్ళతో బంధించిన అనుభవాల్ని
మెల్లగా తనలోకి లాక్కుంటుంది
దోచుకున్న అనుభవాలన్నీ
దాచుకుంటున్న గది
మూగది మాత్రంకాదు-
మ్యూజియం లాంటిది!
నిశ్శబ్దంగానో నిశీధంగానో
వాకిలిలోకి ఏకాంతం అడుగుపెట్టగానే
గది తలుపులు తెరుచుకుంటాయి
గాలి పీల్చుకున్న చిత్రాలు
గూళ్ళు వదిలిన గువ్వపిట్టల్లా
ఆలోచనల ఆకాశం ఆక్రమించుకుంటాయి
అపురూపమైన జీవితరహస్యాలకు
అర్ధాలు ఆవిష్కరిస్తాయి!
అంతుతేలని చేదు సమస్యలకు
అందమైన పరిష్కారాలు చూపిస్తాయి!
****************************************
24. ఓర్పు
ఒక్క క్షణం మెరుపుకోసం
ముక్కలుగా చీలుతున్న
మేఘమాల ఓర్పును
అభినందిస్తాను!
మధురమైన మాతృత్వంకోసం
బాధల మాసాలను భరిస్తున్న
కన్నతల్లి ఓర్పును
అభినందిస్తాను!
తరాల దోపిడీమీద
తిరుగుబాటు చెయ్యని
మనిషి ఓర్పును మాత్రం
అసహ్యించుకుంటున్నాను!
***********************************
25. కాంతిగీతం
జీవితాన్ని ఎదిరించలేని కళ్ళు
జేబులో దాక్కుంటాయి
చితులు మండుతున్న
శిధిలహృదయంలో
కలలన్నీ పేలిపోయి
కళ్ళలో గుచ్చుకుంటాయి
గట్లుతెగిన గాయాలలోంచి
శబ్దాలవేదన పైకిపొంగి
సమస్యల శిఖరారోహణ చేస్తుంది
ఉద్రేకంతో ఉప్పొంగిన కన్నీళ్ళు
చల్లారిన నరాల్లోకి
జలపాతాల్లా దూకుతాయి
అప్పుడు
విశ్వమంతా వ్యాపించే
విద్యుత్ వలయంలో
గాయం ఒక్కటైనా
గేయం అవుతుంది
కొత్తగా కోటిస్వప్నాలు వెలిగించుకుని
కొమ్మలన్నీ పచ్చబడతాయి!
**************************************
26. పల్లవి దొరికిన పాట
గుండెలో కొట్టుకుంటున్న గీతం
గొంతుదాటి బయటికి రాదు
కాలానికి శిలువ వేసినట్టు
లోలకం కదలడం మానేస్తుంది
బతుకుపొరల చిరుగుల్లోంచి
బాధలు వెక్కిరిస్తుంటాయి
భవిష్యత్తు కళ్ళలో సూదులు దింపిన వర్తమానం
మరణవేదన పడుతున్న మానవత్వాన్ని
చితిమీదకు చేర్చబోతోంది!
ఇంతలో-
శూన్యంలో తళుక్కుమని
చుక్క తెగిపడుతుంది
ఆలోచనలకు చుక్క పెట్టేసి
ఆశయం ఆచరణలోకి ఉరుకుతుంది
ఇంకా మేల్కొనని మనుషుల స్వప్నాల్లో
ఎత్తిన పిడికిళ్ళు కనిపిస్తాయి
కేలండరులోని పాతకాగితం
నేలమీదకు రాలిపోతుంది
నిన్నటివరకూ
నిఘంటువుల పుటల్లో
నిద్రపోతున్న పదాలు
కొత్తనెత్తురు నింపుకొంటాయి
గుండెలోంచి పొంగిన లావా
గుడిసెమీద జెండాగా ఎగురుతుంది
పల్లవిదొరికిన పాట
ప్రపంచాన్ని పలకరిస్తుంది!
************************************
27. సంకేతం
ఘోషించే సముద్రం
వేనవేల గొంతులలోని
వేదనలను ధ్వనిస్తుంది!
వర్షించే ఆకాశం
కడుపులుకాలే కర్మజీవుల
కన్నీళ్ళను స్మరిస్తుంది!
ఎరుపెక్కే తూర్పుదిక్కు
క్షుద్రమైన చీకటిపైకి
యుద్ధానికి పిలుస్తుంది!
************************************
28. సముద్రం
ఊరువెలుపల సముద్రం
హోరుమని ఏడుస్తోంది
సమస్తసుఖాలకూ దూరమైన
సామాన్యుడిలా రోదిస్తోంది
అనంతమైన వేదనతో
అలలుగా చీలిపోతోంది
చలనంలేని బండరాళ్ళకేసి
తలను బాదుకుంటోంది
విడుపులేని బాధలగాధల్ని
కడుపులో దాచుకుంటోంది
సగంలో చెరిగిపోయిన కలల్ని
సందిట్లోకి తీసుకుంటోంది
మేఘాలజుట్టు విరబోసుకొని
ఆకాశం జాలిగా వర్షించినా -
కొండలు గుండెలు కరిగి
నదులై కదలివచ్చి పరామర్శించినా-
సముద్రానికి
సాయంకాదు-న్యాయం కావాలి!
శాత్రవసంహారం ధ్యేయం కావాలి!
బాధలు
బడబాగ్నులుగా మారినవేళ-
విషాదాలు
హాలాహలం వెలిగ్రక్కినవేళ-
ఎన్నాళ్ళుగానో మధనపడుతున్న
కన్నీటి కడలి
ఉత్తుంగ తరంగాలతో
ఉప్పెనల రెక్కలు విప్పుతుంది!
ప్రళయతాండవం చేస్తూ
ప్రపంచంమీద దండెత్తుతుంది!
**************************************
29. చలివేట
నరాల్లోకి కత్తులు విసిరేస్తూ
స్వరాల్లోని శక్తులు విరిచేస్తూ
నీ చుట్టూ మూగుతున్న చలి
నీ మీదకు దూకుతున్న పెద్దపులి!
మృత్యుశీతలస్పర్శతో
వెన్నెముక నిచ్చెనమీదుగా
తలలోకి ప్రవేశిస్తుంది
మెదడుగూడులోని ఆలోచనల్ని
చప్పుడు కాకుండా నమలి మింగేస్తుంది
వర్తమానాన్ని బందీచేస్తుంది
అస్తమయాన్ని అందలమెక్కిస్తుంది
సమూహంలోని వ్యక్తిని ఏకాకిని చేస్తుంది
సమాజంలోని శక్తిని చీల్చాలని చూస్తుంది
కాలాన్ని మోసుకుంటూ ముందుకు నడుస్తున్న
గడియారాన్ని బద్దలుకొడుతుంది
వసంతసమీరాలను వెనక్కితిప్పి
శిశిరశిధిలాలలోకి నడిపిస్తుంది
ఖద్దరు ధరించినా కాషాయం వరించినా
కసాయితనమే పులికి ఆభరణం!
కర్కశత్వమే చలికి ఉపకరణం!
కోరికల కొమ్మమీద విరిసిన స్వర్గాల్ని
క్రూరంగా రాల్చేస్తున్న చలికి పచ్చదనం శత్రువు!
కళ్ళలో తొణికిసలాడే సజీవస్వప్నాల్ని
గడ్డకట్టిస్తున్న చలికి వెచ్చదనం మృత్యువు!
అందుకే-
చలితో కొంకర్లు తిరిగిన చేతులు
వెచ్చగా బిగించిన పిడికిళ్ళు కావాలి!
కొమ్మల కడుపులో తలదాచుకున్న ఆకులు
గురిపెట్టిన తుపాకులుగా పైకిలేవాలి!
సమష్టిభావం సమూహవ్యూహమై
ఈ చలిని ముట్టడించాలి!
ఈ పులిని మట్టుపెట్టాలి!!
************************************
30. దుఃఖం
ఇక్కడ నేను
దుఃఖం గురించి మాట్లాడుతున్నాను
కలలూ కన్నీళ్ళూ
కలబోసుకున్న ఆలోచనల్లో
జ్వరతీవ్రతతో
జ్వలించే దుఃఖం గురించి మాట్లాడుతున్నాను
మనిషినుంచి మరో మనిషికి
దుఃఖం విద్యుత్తులా ప్రవహిస్తుంది
కన్యాకుమారినీ హిమాలయాలనూ
రెండు కన్నీటిబిందువులతో సంధిస్తుంది
రెండేరెండు విసర్గలమేకులతో బంధిస్తుంది
స్పందన దాని ముఖచిత్రం
స్పందన దానిపతాకశీర్షిక!
విడిపోతున్న అనుబంధాలకూ
పోటెత్తిన కల్లోలసముద్రాలకూ
దుఃఖం సంకేతకమై నిలుస్తుంది
నిజమైన దుఃఖం నీతోపాటు
పరిసరాలనుకూడా పరిశుభ్రం చేస్తుంది
పక్కదారి పడుతున్న మిత్రుడా!
పగిలిన గుండె లోతుల్లోంచి
ఎగిసిపడిన దుఃఖాన్ని
నువ్వు ఎప్పుడూ చూడకపోతే
దాని రంగూ రుచీ వాసనా నీకు ఎలా తెలుస్తాయి?
నువ్వు దుఃఖాన్నికూడా
సుతారంగానూ సుతిమెత్తగానూ చెబుతున్నావు
కన్నీటివెనుక కారణాలకంటే
తడిసిన చెక్కిళ్ళ మెరుపులనే
మా మీదకు ఫోకస్ చే్స్తున్నావు
నీ దుఃఖం చక్కిలిగిలి పెడుతుంది
పరమ ఒయ్యారంగా
అక్షరాల పక్కలోకి చేరుతుంది
మదనతాపాలనూ ఇంద్రచాపాలనూ
నువ్వు ఆధునికోత్తరశైలీవిన్యాసాలతో
దుఃఖంలోకి అనువదిస్తున్నావు
అరాచకత్వాన్నీ విశృంఖలత్వాన్నీ
అక్షరాలతో అలంకరిస్తున్నావు
నిజమైన దుఃఖం నీకేం తెలుసు?
చిట్లిన నీటిబుడగకు తెలుసు
తెగిన దారానికి తెలుసు
సర్వస్వం కోల్పోయిన ఖాళీసీసాకు తెలుసు
ఆకులు రాలుతున్న శబ్దాలు
చెట్లుకూలుతున్న దృశ్యాలు
దుఃఖాన్ని కలిగిస్తాయి
గాయపడిన నమ్మకాలు
కన్నతల్లి రహస్యాల అమ్మకాలు
దుఃఖాన్ని కలిగిస్తాయి
యుగధర్మంపేరుతో తెగిపడిన శిరస్సూ-
గురుదక్షిణ కుట్రలో బలైపోయిన బొటనవ్రేలూ-
దుఃఖాన్ని కలిగిస్తాయి
నీ దుఃఖవ్యాపారానికి కారణాలు వేరు!
జారిపోయిన పదవిగురించీ
అందని పరాయిపెదవిగురించీ నువ్వు దుఃఖిస్తావు
కప్పలతక్కెడ రాజకీయంలో
కాలు ఎక్కడపెడితే లాభమో తేల్చుకోలేక దుఃఖిస్తావు
ఆరంతస్తులమేడలోని
అజీర్తిబాధ నీకు తెలుసు-
శూన్యాకాశంలాంటి కడుపులో
ఆకలిశూల నీకేం తెలుసు?
కారుకిందపడి చచ్చిన కుక్కపిల్ల గురించికాదు-
రక్తంమరక అంటుకున్న మడ్ గార్డుగురించి నీ దుఃఖం!
వేటగాడిచేతిలో
దెబ్బతిన్న పక్షిని గాలికొదిలేస్తావు
గురితప్పిన గుండు ఖరీదెంతోఅని
విలవిలలాడిపోతావు
పనిపిల్లవీపు చిట్లగొట్టిన నీకు
పశ్చిమాసియా సమస్య దుఃఖం కలిగిస్తుంది
వేదిక దిగినవెంటనే రంగులు కడిగేసుకుంటావు
నాలుకమీద నర్తించిన అక్షరాల శీలాన్ని దోచుకుంటావు
నీ ప్రచారదుఃఖం
హృదయంలోంచి కాదు-
మెదడులోంచి వస్తుంది!
నరాల వాగుల్లోంచి పరుగులెత్తి
కంటిరెప్పలగట్లు తెంచుకుని
పొంగిపొరలే దుఃఖానికి
హృదయమే నాసికాత్రయంబకం!
అంతరాంతరసీమల్లోని దుఃఖం
మందుపాతరలా హఠాత్తుగా పేలిపోతుంది!
కొండలమీది జలపాతంలా
అమాంతంగా కిందకు దూకుతుంది!
మూర్ఖుడా-
బాధను వ్యక్తీకరించే భాషకు
బాజాభజంత్రీలు అక్కరలేదు
అత్యాధునికమైన
అలంకారాలూ అతిశయాలూ అవసరం లేదు
నీది హైటెక్ దుఃఖం!
నీవి గ్లిజరిన్ కన్నీళ్ళు!!
************************************
31. స్నేహగీతం
నేను
బైబిలు పేజీలమధ్య
నెమిలికన్నులు దాచుకుంటాను
కన్య మరియు మాతృప్రేమను
కుంతీదేవి పొత్తిళ్ళలో ఆవిష్కరిస్తాను
శిలువమీంచి జాలువారిన కారుణ్యాన్నీ
మురళిలోంచి పొంగులెత్తిన ప్రేమతత్వాన్నీ
నా ఒంటిచుట్టూ కప్పుకుంటాను
వెన్నతింటున్న క్రీస్తునీ
రొట్టెతింటున్న కృష్ణుణ్నీ
చెట్టపట్టాలు వేయిస్తాను
అల్లానూ ఆంజనేయుణ్నీ
అల్లిబిల్లి ఆటలాడిస్తాను
ఆంధ్రావారి అబ్బాయినీ
ఆర్మీనియా అమ్మాయినీ
పెళ్ళిపీటలమీద కూర్చోబెడతాను
మిత్రుడా!
మనం ఎక్కడ దారితప్పామో తెలుసుకుందాము
చిక్కుముడులన్నీ విప్పేసి కలుసుకుందాము
మనిషికీ మనిషికీ మధ్యలో
పైకిలేచిన గోడల్ని కూల్చేద్దాము
వసుధైక కుటుంబంలో
డేగల్ని తరిమేసి
పావురాల్ని పెంచుకుందాము
ఏటిఒడ్డున పిచ్చుకగూళ్ళనూ
జామచెట్టుకింద గుజ్జనగూళ్ళనూ
ఏ మహాకవీ అక్షరాల్లోకి అనువదించలేదు
ఏ శాస్త్రవేత్తా వాటి విలువను ప్రకటించలేదు
స్నేహం సహకారాన్ని అందిస్తుంది
స్నేహం సమభావాన్నిపండిస్తుంది
స్నేహం
కలతనిద్రలో
కన్నతల్లి చేతిస్పర్శలా ఆదుకుంటుంది
నీ అంతరంగాన్ని ఆర్ధ్రంచేసే
అక్షరమై పలుకరిస్తుంది
నీ ఆలోచనల వలయంలోకి
అగరుధూపంలా అడుగుపెడుతుంది
స్నేహపూర్వకమైన కరచాలనం
నీ శరీరాన్ని హఠాత్తుగా విద్యుదీకరిస్తుంది
పారిపోయిన అనుభూతుల
చిరునామాలు పట్టుకుంటుంది
పాలపిట్టల రెక్కల్లోంచి
జారిపడ్డ రాగమై నిన్ను చుట్టుకుంటుంది
నిజం మిత్రమా-
పరాజయాలనూ పరాభవాలనూ
మోస్తున్న మానవుడు
ఒక్క కంటిచూపుతో
అలెగ్జాండరు అయిపోతాడు
ఒక్క చిరునవ్వుతో
ఎవరెస్టు అధిరోహిస్తాడు
ఒకేఒక్క స్నేహపూర్వకమైన పలకరింపుతో
కొత్త ఉగాదిలా పచ్చగా విచ్చుకుంటాడు
ఒంటరితనం ఎడారిలో
దాహార్తిని తీర్చడానికి
స్నేహమేకదా ఒయాసిస్సు
దీపంపెట్టే దిక్కులేని
శిధిలసౌధంలో
స్నేహమేకదా నవోషస్సు!
రా నేస్తం!
తరతరాల గాయాలకు
మనమే కట్లుకట్టుకోవాలి
యుగయుగాల చీకటికి
మనమే చిచ్చు ముట్టించి రావాలి
అందుకే-
జీవితాన్ని జీవించడం కోసం
కొంచెం నమ్మకాన్ని పెంచుకుందాము
అలసిపోయిన ఆలోచనలకు
సేదతీర్చడంకోసం
పిడికెడు స్నేహాన్ని పంచుకుందాము
రా! మిత్రమా!
కాన్వెంటు కార్మికులు మొయ్యలేకపోతున్న
పలకలూ పుస్తకాలూ బయటికి విసిరేద్దాము
మాసిపోతున్న బాల్యాన్ని
పంచరంగుల బెలూన్లలో పూరించి
పిల్లలందరికీ పంచిపెడదాము
సీతాకోకచిలుకలమీద ఎక్కించి
స్వప్నలోకాల అంచుల్లోకి ఎగరేద్దాము
తుపానులో చిక్కుకున్న ఆకాశాలను
ఇంద్రచాపాలతో అలంకరిద్దాము
క్రూరమృగాలమధ్య
బిక్కుబిక్కుమంటున్న పాటల్ని
జనంలోకి తీసుకొద్దాము
శత్రుకూటాలమధ్య
ఇరుక్కుపోయిన జెండాల్ని విడిపించి
భావితరాలకు అందజేద్దాము
స్నేహం మన ఆదర్శం!
స్నేహమే మన సందేశం!
***********************************
32. వాతావరణం
అక్కడ కావచ్చు
ఇక్కడ కావచ్చు
ప్రజలు ఆలోచించే అవసరం లేకుండా
ప్రభుత్వం ఎప్పుడూ మెలుకువగా ఉంటుంది
ప్రశ్నించే ప్రమాదాలు రాకుండా
ప్రభుత్వమే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది
కొత్తగా రోడ్లు నిర్మిస్తారు
కొత్తగా వంతెనలు నిర్మిస్తారు
ప్రజలకోసం
కొత్తగా జైళ్ళుకూడా నిర్మిస్తారు
అన్నీ సజావుగానే సాగిపోతాయి
అంతా ప్రశాంతంగా ఉంటుంది
రాబందుల రాజ్యంలో
కదులుతున్న కంకాళాలకు
ఆవేశం అధికంగానే ఉంటుంది
ఆలోచనే స్వల్పంగా ఉంటుంది
అవసరం లేనప్పుడు రెచ్చిపోతుంటారు
చరిత్రచెప్పిన పాఠాలు మర్చిపోతుంటారు
అయిదేళ్ళకోసారి
దొంగజపం చేసే కొంగలనే
అందలాలు ఎక్కిస్తారు
వాగ్దానాల కడియం చూపిస్తున్న
బోసిపులి కౌగిట్లోకి
గుంపులుగా పోతుంటారు
కొత్తకొత్త జెండాగుడ్డలతో
మెత్తగా గొంతులు కోయించుకుంటారు
అంతా సజావుగానే సాగిపోతుంది
వాతావరణం ప్రశాంతంగానే కనిపిస్తుంది
మాజీ నాజీలు
తాజాగా నాయకులవుతారు
ముస్సోలినీ, హిట్లరూ
ప్రజాస్వామ్యం ముసుగులు తొడుక్కుంటారు
నియంతలూ నరహంతకులూ
తమకు తప్పించి తక్కినవాళ్ళెవరికీ
తలకాయలు లేవని భావిస్తారు
పారుతున్న రక్తంతో పండగలు జరిపిస్తారు
సంగీతాన్ని శాసిస్తారు
సాహిత్యాన్ని చావగొడతారు
మెదళ్ళకు దళ్ళు కడతారు
పొదరిళ్ళను తగలబెడతారు
పావురాల మాంసంతింటూ
పక్క ఊళ్ళకు శాంతి సందేశాలు పంపిస్తారు
అంతా ప్రశాంతంగానే ఉంటుంది
అంతా క్షేమంగానే అఘోరిస్తుంది
న్యాయం తక్కెడ
అధికారం కోతిచేతిలో తైతక్కలాడుతుంది
సామాన్యుడి వాటా
చట్టబద్ధంగానే మాయమైపోతుంది
ప్రజాస్వామ్యాన్ని రక్షించే హడావుడిలో
పార్టీలు ప్రజల్ని మర్చిపోతాయి
జెండాలన్నీ మూకుమ్మడిగా
జనం గుండెల్లో గుచ్చుకుంటాయి
లక్ష్యాన్ని తాకట్టుపెట్టిన నాయకులు
సిద్ధాంతాలను చింపేసి చెత్తబుట్టలో పారేస్తారు
వక్రభాష్యాలతో జనాన్ని పక్కదారి పట్టిస్తారు
నిన్న చీకొట్టినవాడినే
నేడు ఆత్రంగా కౌగిలించుకుంటారు
స్వార్ధం ఇంధనంతో
రాజకీయరధం పరుగులు తీస్తుంది
అంతా ప్రశాంతంగా ఉంటుంది
ఆ పక్షమైనా ఈ పక్షమైనా
అధినేతలు సుఖంగానే ఉంటారు
కులతత్వం ప్రగతిశీలమవుతుంది
మతమౌఢ్యం ఫేషన్ గా వర్ధిల్లుతుంది
కత్తిపోట్లూ బాంబుదాడులూ
వార్తల్లో కరాళనృత్యం చేస్తాయి
కర్ఫ్యూలూ హార్తాళ్లతో
వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది
అవును-
విషసర్పాన్ని ముట్టడించేముందు
చలిచీమలు ప్రశాంతంగానే ఉంటాయి
నిప్పులుకక్కేముందు
తుపాకీ ప్రశాంతంగానే ఉంటుంది
తుపాను వచ్చేముందుకూడా
వాతావరణం ప్రశాంతంగానే ఉంటుంది!
********************************
$$$$$$$$$$$$$$$$$
No comments:
Post a Comment